Jagan: ప్రమాణస్వీకారం చాలా సింపుల్ గా ఉండాలని జగన్ చెప్పారు: సీఎస్
- జగన్ ఆడంబరాలకు పోవడంలేదు
- అభిమానులు, అతిథుల సౌకర్యాలే ముఖ్యమని చెప్పారు
- జగన్ ఆలోచనకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నాం
తొలిసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించబోతున్న వేళ భారీ సంబరాలకు బదులుగా, ప్రమాణస్వీకారోత్సవాన్ని చాలా నిరాడంబరంగా నిర్వహించాలన్నది జగన్ అభిమతం అని రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. అందుకే అనవసర ఆడంబరాలను పక్కనబెట్టి, అభిమానులు, అతిథుల సౌకర్యాలకే పెద్దపీట వేశామని చెప్పారు. ఈ క్రమంలో జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి వచ్చే అభిమానులు అధికారులతో సహకరించాలని సీఎస్ కోరారు.
ఎలాంటి పాసులు లేనివాళ్లు కూడా 30,000 మంది వరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చని అన్నారు. ఈ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. స్టేడియంలో స్థలం అందుబాటులో లేని పక్షంలో, సమీప ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎవరికీ అసౌకర్యం కలగడకూడదన్నది కాబోయే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని స్పష్టం చేశారు. ఎక్కడా ఆడంబరాలకు తావులేని రీతిలోనే జగన్ అభీష్టానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎల్వీ చెప్పారు. ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, జగన్, తాను ప్రధాన వేదికపై ఉంటామని, ముఖ్య అతిథులు ఉపవేదికపై ఉంటారని ఆయన వివరించారు.