Andhra Pradesh: జూన్ 7న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్న జగన్
- రేపు సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం
- జూన్ రెండో వారంలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- శాసనసభ్యుల ప్రమాణం కోసం అసెంబ్లీలో ఏర్పాట్లు
రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో రెండో పర్యాయం ఎన్నికలు జరగ్గా వైసీపీ 151 సీట్లతో తిరుగులేని ఆధిక్యం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం విజయవాడ వేదికగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. అయితే, రేపు జగన్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, జూన్ 7వ తేదీన జగన్ తన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. మంత్రివర్గం ఆమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. శాసనసభ ప్రత్యేక సమావేశాలు జూన్ 11, 12 తేదీల్లో జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని శాసనసభ కార్యాలయానికి సమాచారం అందింది. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. శాసనసభలో అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించడం ఆనవాయతీ. ఆ లెక్కన ప్రస్తుత ఏపీ శాసనసభలో చంద్రబాబునాయుడే సీనియర్. ఆయన 1978లో తొలిసారిగా గెలిచారు. 1983లో ఓటమిపాలైనా ఆ తర్వాత మాత్రం గెలుపును వదల్లేదు. మరి చంద్రబాబునాయుడు ప్రోటెం స్పీకర్ అవతారం ఎత్తి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారో లేదో చూడాలి!