Chandrababu: వెల్లువెత్తిన భావోద్వేగం... చంద్రబాబును పట్టుకుని బోరున విలపించిన మహిళ!
- ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న టీడీపీ కార్యకర్తలు
- భవిష్యత్తు బాగుంటుందని అధినేత భరోసా
- స్వయంగా సముదాయించే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు
ఎన్నికల ఫలితాలు వెల్లడై ఐదు రోజులు గడిచిపోయింది. అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పడిపోయింది. జగన్ ప్రభుత్వం రానుంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని తెలుగుదేశం కార్యకర్తలు, తమ అధినేతను కలిసి సంఘీభావం తెలుపుతూనే, తప్పెక్కడ జరిగిందో తెలియడం లేదని కుమిలిపోతున్నారు. చంద్రబాబును కలవగానే ఎందరో భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలను ఓదార్చడం చంద్రబాబు వల్ల కూడా కావడం లేదు.
నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబును ఎంతో మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు కలువగా, పలువురు మహిళలు ఆయన వద్ద కన్నీరు పెట్టుకుంటుంటే, వారిని ఓదార్చడం చంద్రబాబు వల్ల కూడా కాలేదు. లోక్ సభ ఎన్నికల తరువాత తొలిసారిగా చంద్రబాబు బయటకు వచ్చిన వేళ కనిపించిన దృశ్యాలివి. ప్రతి ఒక్కరూ విషణ్ణ వదనాలతోనే కనిపించారు. వారందరినీ స్వయంగా సముదాయించిన చంద్రబాబు, గతాన్ని మరువాలని, భవిష్యత్తు బాగుంటుందని భరోసాను ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక ఓ మహిళా కార్యకర్త, చంద్రబాబును పట్టుకుని, ప్రతి మహిళా మీ నుంచి లబ్ది పొందిందని, అయినా ఓట్లు పడలేదని, మీరు లేని బాధ మరో ఆరు నెలలలో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి వస్తుందని వ్యాఖ్యానించడంతో చంద్రబాబు కూడా కాస్తంత భావోద్వేగానికి లోనయ్యారు. పూర్ణచంద్రిక అనే ఆ కార్యకర్త, ఇంత ఎదురుగాలి వీచినా గల్లా జయదేవ్ వంటి నాయకులు గెలిచారని, టీడీపీ ఓడిపోవడం వెనుక కారణం నాయకులేనని, మీరు మంచివారిని నిలిపితే, వారిని ఓడించడానికి పార్టీ నేతలే ప్రయత్నించారని అన్నారు. టీడీపీ ఓటమి వెనుక 90 శాతం నాయకులే కారణమని ఆమె అనగా, అన్నింటినీ సమీక్షిద్దామని చంద్రబాబు ఓదార్చారు.