Anantapur District: అనంతపురం జిల్లాలో మొదలైన వజ్రాల అన్వేషణ.. పెద్ద ఎత్తున తరలివస్తున్న జనం

  • ఇటీవల ఇద్దరు కూలీలకు దొరికిన వజ్రాలు
  • శనివారం సాయంత్రం కురిసిన వర్షం
  • ఆదివారం మొదలైన వెతుకులాట

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలో వజ్రాల అన్వేషణ ప్రారంభమైంది. సాధారణంగా తొలకరి వర్షాలు ప్రారంభం కాగానే మొదలయ్యే ఈ అన్వేషణ ఈసారి ముందే ప్రారంభమైంది. శనివారం రాత్రి మండలంలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురవడంతో ఆదివారం ఉదయం జనాలు పొలాలకు బయలుదేరారు. ఎండ వేడిమిని సైతం లెక్కచేయకుండా పొలాల్లో అంగుళం అంగుళం క్షుణ్ణంగా పరిశీలించారు.

వజ్రకరూరు సమీపంలోని  ఉయ్యాలగుట్ల, గ్యాస్‌ గోదాం, మక్కిరేని కుంట పొలాల్లో ఆదివారం వజ్రాల వేట జోరుగా సాగింది. ఒక్క వజ్రమైనా దొరక్క పోతుందా? కష్టాలు తీరకపోతాయా? అన్న ఉద్దేశంతో చీకటి పడే వరకు వజ్రాల కోసం వెతికారు. ఇటీవల ఇద్దరు వ్యవసాయ కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. స్థానిక వ్యాపారి ఒకరు వాటిని రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఈసారి అంచనాలు బాగా పెరిగాయి. తొలకరి ప్రారంభంలో ఇక్కడ వజ్రాల వెతుకులాట సర్వసాధారణంగా మారింది.

More Telugu News