Chandrababu: బోసిపోయిన చంద్రబాబు నివాస ప్రాంతం!
- కార్ పార్కింగ్ ఏరియా ఖాళీ
- పెద్దగా కనిపించని కార్యకర్తలు
- రోడ్డుపై బారికేడ్ల వద్ద కనిపించని భద్రతా సిబ్బంది!
ఒక్కరోజు వ్యవధిలో ఎంత తేడా! నిన్నమొన్నటి దాకా ఎంతో సందడిగా కనిపించిన చంద్రబాబు నివాస ప్రాంతం ఇప్పుడు జనసంచారం లేక వెలవెలబోతోంది. అమరావతి కరకట్ట రోడ్డులో ఉండే ఆయన నివాసం వద్ద నిత్యం జనసందోహం కనిపించేది. కానీ, ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం దరిమిలా చంద్రబాబును కలిసేందుకు వచ్చేవారి సంఖ్య బాగా పడిపోయింది. చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు కూడా పెద్దగా కనిపించడంలేదు.
ఎంట్రన్స్ వెలుపల కార్ పార్కింగ్ ఏరియా అంతా ఖాళీగా దర్శనమిస్తోంది. సీఎం కోసం కల్పించే అదనపు భద్రతలో భాగంగా ఇంతకుముందు రోడ్డుపై బారికేడ్ల వద్ద భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడా సిబ్బంది కనిపించకపోవడం మారిన పరిస్థితికి నిదర్శనం! గురువారం మధ్యాహ్నం నుంచే చంద్రబాబు నివాస ప్రాంతం కళ తప్పిందని చెప్పాలి.