YSRCP: ఏపీలో ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ కు అందజేయనున్న సీఈవో
- గవర్నర్ అపాయింట్ మెంట్ కోరిన ద్వివేది
- రేపు వైసీపీ ఎమ్మెల్యేల సమావేశం
- శాసనసభా పక్ష నేతగా జగన్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచి ఏపీలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక, రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ నరసింహన్ కు అందజేయనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల పేర్లతో ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయగానే, సీఈవో అందించిన వివరాల ఆధారంగా గవర్నర్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు జగన్ ను ఆహ్వానిస్తారు. మరోవైపు, శనివారం వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమై శాసనసభాపక్ష నేతగా జగన్ ను ఎన్నుకుంటారు. ఆ తర్వాత జరిగే ఎంపీల సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకుంటారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానాలు పంపారు.