Andhra Pradesh: ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: కోడెల
- ప్రజల్లో అనుమానాలున్నాయి
- శరద్ పవార్ కూడా ఇదే చెప్పారు
- ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం
సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి అంబటి రాంబాబు చేతిలో పరాజయంపాలైన ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడారు. ఫలితాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. అయితే, ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని, ఆ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీదేనని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో శరద్ పవార్ వంటి నాయకులు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కోడెల పేర్కొన్నారు. కాగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లి బరిలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన కోడెల శివప్రసాదరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది.