Telugudesam: గుంటూరు పార్లమెంటు కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత... ఆలస్యంగా వెల్లడి కానున్న ఫలితం!
- తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు లెక్కించాలని వైసీపీ పట్టు
- అభ్యంతరం చెప్పిన గల్లా
- కౌంటింగ్ కేంద్రంలో తిష్టవేసిన టీడీపీ, వైసీపీ నేతలు
గుంటూరు లోక్ సభ స్థానం కౌంటింగ్ కేంద్రం వద్ద ఆఖరి రౌండ్లలో ఉద్రిక్తత ఏర్పడింది. టీడీపీ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తుతం 4,300 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లను కూడా లెక్కించాలంటూ వైసీపీ పట్టుబట్టింది. దీనిపై గల్లా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకసారి తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్లు ఎలా చెల్లుతాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాన్ని అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారంటూ వైసీపీ నేతలపై టీడీపీ ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలు కౌంటింగ్ కేంద్రంలోనే తిష్టవేయడంతో కౌంటింగ్ ప్రక్రియకు స్వల్ప అవాంతరం ఏర్పడింది. ఇరువర్గాలకు అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.