Jagan: జగన్ ఘనవిజయం నేపథ్యంలో తెరపైకి 'యాత్ర-2'
- జగన్ కు విషెస్ చెప్పిన యాత్ర దర్శకుడు
- మీరు నిజంగా అర్హులు అన్నా అంటూ ట్వీట్
- చరిత్ర సృష్టించారంటూ కితాబు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నూతన అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ నుంచి విభేదించి వైసీపీని స్థాపించిన జగన్ ఈసారి ఎన్నికల్లో తన పార్టీని తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన వైనం నిస్సందేహంగా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాలి. 175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలోకి ఏకంగా 150కి పైగా సీట్లతో అడుగుపెట్టడం మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో, దివంగత వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన టాలీవుడ్ యువ దర్శకుడు మహి వి రాఘవ్ జగన్ గ్రాండ్ విక్టరీపై స్పందించారు.
"ఈ విజయానికి మీరు నిజంగా అర్హులు అన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచిపనులను మించిపోయేలా మీరు పరిపాలన చేస్తారని భావిస్తున్నాం. భావితరాలకు వివరించదగిన చరిత్ర సృష్టించారు మీరు" అంటూ ట్వీట్ చేయడమే కాకుండా యాత్ర-2 అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. దాంతో, జగన్ గెలుపు ప్రస్థానాన్ని యాత్ర-2 గా తెరకెక్కించే ఉద్దేశాన్ని మహి వి రాఘవ్ చెప్పకనే చెప్పారు.