Chandrababu: కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం
- టీడీపీకి తొలి ఫలితం
- చంద్రమౌళిపై బాబు గెలుపు
- కౌంటింగ్ మొదట్లో వెనుకబడిన టీడీపీ అధినేత
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఎంతో పోటీ ఉంటుందనుకున్న నేపథ్యంలో, కౌంటింగ్ మొదలైన కాసేపటికే ఫలితాల సరళి తేటతెల్లమైంది. టీడీపీ అనూహ్యరీతిలో బాగా వెనుకబడిపోగా, జగన్ సారథ్యంలోని వైసీపీ తిరుగులేని విధంగా ముందంజ వేసింది.
ప్రస్తుతం వైసీపీ 17 స్థానాల్లో విజయం సాధించి మరో 133 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీడీపీ ఓ స్థానం గెలుచుకుని మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, వైసీపీ నేత చంద్రమౌళిపై గెలిచారు. ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటివరకు చంద్రబాబు వెనుకంజలో ఉండడం టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఆయన తదుపరి రౌండ్లలో పుంజుకోవడమే కాకుండా చివరికి విజయం నమోదు చేశారు.