Chandrababu: కాసేపట్లో చంద్రబాబు మీడియా సమావేశం
- జగన్ కు శుభాకాంక్షలు చెప్పే అవకాశం
- పార్టీ ఓటమిపై విశ్లేషణ
- టీడీపీకి దారుణ ఫలితాలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోరంగా వెనుకబడిపోవడం పట్ల తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. హుందాగా ఓటమిని అంగీకరించడంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతారని తెలుస్తోంది. అయితే, ముఖ్యంగా టీడీపీ ఓటమికి కారణాలను విశ్లేషించే అవకాశాలు ఉన్నాయి. నిన్నటివరకు ఎంతో ధీమాగా ఉన్న స్థితి నుంచి ఒక్కసారిగా పాతాళంలోకి పడినట్టుగా ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కనిపిస్తుండడం తెలుగుదేశం పార్టీ వర్గాలకు మింగుడుపడడం లేదు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 149 స్థానాల్లో, టీడీపీ 26 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. పవన్ కల్యాణ్ జనసేన పార్టీ సున్నా ఆధిక్యంతో రేసు నుంచి నిష్క్రమించినట్టే కనిపిస్తోంది. ఇక, లోక్ సభ ఫలితాల్లోనూ రాష్ట్రంలో వైసీపీ తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మొత్తం 25 స్థానాలకు గాను వైసీపీ 24 స్థానాల్లో ముందంజలో ఉండగా, టీడీపీ ఒక్క స్థానంలో లీడ్ కొనసాగిస్తోంది.