Congress: బీజేపీ మునిగిపోతున్న పడవ... ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన పనిలేదు: శశి థరూర్
- ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినన్ని సీట్లు రాకపోవచ్చు
- బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల
- ఓటర్ల తీర్పు రేపు తెలుస్తుంది
కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ తాజా పరిణామాలపై స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ వైపు మొగ్గుచూపడం పట్ల ఆందోళన చెందాల్సిన పనేమీలేదని అన్నారు. 2004లో కూడా ఎన్డీయే గెలుస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఊదరగొట్టాయని, కానీ, ఓడిపోయిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, బీజేపీ మునిగిపోయే పడవ లాంటిదని వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్ లో చెప్పినన్ని సీట్లు బీజేపీకి రాకపోవచ్చని అన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వేలో అభిప్రాయాలు తెలియజేసేవాళ్లు నిజమే చెబుతారని భావించలేమని, అధికార పార్టీ గురించి చెప్పకపోతే ప్రభుత్వ రాయితీలు అందవని చాలామంది భయపడి అధికార పక్షానికే ఓటేశామని చెబుతారని థరూర్ వివరించారు. అయినా, ఓటర్ల తీర్పు ఎలా ఉందన్నది రేపు స్పష్టమవుతుందని థరూర్ పేర్కొన్నారు.