: ఇలా చేస్తే రోజంతా ఉల్లాసమే...!
మన రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే... ఏం చేయాలి...? ఏం లేదు... మనకు ఇష్టమైన హుషారైన పాటలు వింటే సరి! సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది. అది మన మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంపైన సంగీతం మానసికంగా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని శాస్త్రీయపరంగా నిరూపించారు మిస్సోరి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు.
పలు వ్యాధులను నయం చేయగలిగే శక్తి సంగీతానికి ఉందని చాలా కాలం క్రితమే పరిశోధనల్లో ఋజువైంది. అయితే సంగీతం వల్ల కేవలం వ్యక్తిగత ఆనందం మాత్రమే కలుగుతుందని మనం అనుకుంటాం. అయితే వ్యక్తిగత ఆనందం అనేది స్థూలంగా సామాజిక ప్రయోజనకారిగా కూడా ఉంటుందని ఈ అధ్యయనానికి సారధ్యం వహించిన యూనా ఫెర్గూసన్ చెబుతున్నారు. వ్యక్తిగత ఆనందం అనే దాన్ని కేవలం స్వప్రయోజనం అనే కోణం నుండే చూడరాదని ఫెర్గూసన్ అభిప్రాయపడుతున్నారు.
ఫెర్గూసన్ తన అధ్యయనానికి ఎంపిక చేసుకున్న అభ్యర్ధులను రెండు వర్గాలుగా విభజించి వారిలో ఒక వర్గం వారిని సాధారణ సంగీతం వినమని, రెండవ వర్గం వారిని హుషారైన సంగీతం వినమని చెప్పారు. రెండు వారాల పాటు వీరిని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. తన పరిశీలనలో సాధారణ సంగీతం విన్న వారికంటే హుషారైన సంగీతం విన్నవారిలోనే మానసిక సంతోషం స్థాయిలు అధికంగా ఉన్నట్టు కనిపించిందని ఆమె తెలిపారు. అంతేకాదు... హుషారైన సంగీతం విన్నవారు కుంగుబాటునుండి, దిగులు నుండి కూడా ఇట్టే కోలుకున్నారని ఆమె చెబుతున్నారు. కాబట్టి చక్కగా మనకు ఇష్టమైన హుషారైనా సంగీతం వింటూ మానసికానందాన్ని పొందుదాం... మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం...!