Andhra Pradesh: చివరకు న్యాయస్థానాలను కూడా చంద్రబాబు నమ్మడం లేదు: వైసీపీ నేత అంబటి
- ఏబీ వెంకటేశ్వరరావు, లోకేశ్ ను మాత్రమే బాబు నమ్ముతారు
- ఏపీలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు
- చంద్రబాబు ఒక తుంటరి ఆటగాడిలా మిగిలిపోతారు
ఎన్నికల కమిషన్, వీవీ ప్యాట్స్, ఈవీఎంలు, ఎగ్జిట్ పోల్స్.. ఇలా దేనిపైనా చంద్రబాబుకు నమ్మకం లేదని, చివరకు న్యాయస్థానాలను కూడా ఆయన నమ్మడం లేదని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం ఏబీ వెంకటేశ్వరరావు, నారా లోకేశ్ లను మాత్రమే చంద్రబాబు నమ్ముతారని విమర్శించారు. ఏపీలో గెలిచే పరిస్థితి లేని చంద్రబాబు, దేశమంతా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో చంద్రబాబు ఒక తుంటరి ఆటగాడిలా మిగిలిపోతారని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను అంబటి గుర్తుచేశారు. ‘చెడ్డ కార్మికుడు మాత్రమే పనిముట్లతో తగాదాలు పెట్టుకుంటాడు’ అని నాడు ప్రణబ్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని అన్నారు. చెడ్డ కార్మికుడిలా, చెడ్డ రాజకీయ నేతలా అన్ని వ్యవస్థలపై చంద్రబాబు నెపం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు దేవినేని ఉమ, బుద్ధా వెంకన్నపై ఆయన విరుచుకుపడ్డారు.