C Ramachandraiya: పిలవకున్నా వెళ్లి ఏపీ పరువు తీస్తున్న చంద్రబాబు: రామచంద్రయ్య నిప్పులు
- ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీడీపీకి వ్యతిరేకం
- ఓటమిని ఈవీఎంలపై నెట్టే యోచనలో చంద్రబాబు
- రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారన్న రామచంద్రయ్య
జాతీయ స్థాయిలో ఏ నేతా పిలవకున్నా, పనిగట్టుకుని వెళుతున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల పరువు తీస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీ రామచంద్రయ్య నిప్పులు చెరిగారు. ఎగ్జిట్ పోల్స్ తనకు ప్రతికూలంగా రావడంతో తట్టుకోలేకపోతున్న చంద్రబాబు, తన ఓటమిని ఈవీఎంలపై నెట్టేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అన్నారు.
ఈ ఉదయం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడం సిగ్గు చేటని, రాజ్యాంగ వ్యవస్థకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. గడచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన ఆయన, చంద్రబాబు దేశమంతా తిరిగినా ప్రయోజనం కలగబోదని, ఆయన హుందాతనాన్ని ఏనాడో కోల్పోయారని, అందుకే విపక్షాల సమావేశానికి చంద్రబాబును పక్కకు పెట్టారని ఎద్దేవా చేశారు.