: అరవైలోనూ బలమైన దంతాలు...!
అరవై ఏళ్లు దాటాక మన శరీరంలో వచ్చే ప్రధానమైన మార్పుల్లో ముఖ్యంగా చెప్పుకోదగినది దంతాలు ఊడిపోవడం. చిన్నప్పుడు పాలపళ్లు ఊడి వాటి స్థానంలో కొత్త పళ్లు పుట్టుకొచ్చేవి. కానీ అరవై ఏళ్లకు ఊడిపోయే పళ్లు మళ్లీ రావు. అయితే ఇవి మళ్లీ వస్తే... ఇక వయసు పెరిగినా ఆహారం తినేందుకు కష్టపడాల్సిన పనిలేదు. కట్టుడు పళ్ల అవసరం రాదు... ఈ విషయంపైనే శాస్త్రవేత్తలు ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు.
మొసళ్లకు నోటిలో సుమారు 80 వరకూ దంతాలుంటాయి. ఇవి ఆహారం తినే సమయంలో వీటి దంతాలు వాటి జీవిత కాలంలో సుమారు 50 సార్లకు పైగా ఊడిపోతాయి. అయితే వాటి స్థానంలోనే మళ్లీ కొత్త దంతాలు పుట్టుకొస్తుంటాయి. దీంతో అవి ఆహారాన్ని తినడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా భోంచేస్తాయి. అందుకే సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ చెంగ్ మింగ్ చువాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు మొసలి దంతాల పుట్టుకపై పరిశోధనలు చేస్తున్నారు.
మొసళ్లకు కొత్త దంతాల పుట్టుక వెనుక వాటి శరీరంలోని కణ సంబంధ ప్రక్రియను గురించి వీరు తొలిసారిగా కనుగొన్నారు. మొసళ్ల దంతాల అడుగున ఉండే కణజాలం పొర (డెంటల్ లామినా)లోని కణాలు మూలకణాల్లా పనిచేస్తున్నాయని, ఈ కారణంగానే ఊడిపోయిన దంతాల స్థానంలో కొత్త దంతాలు పుట్టుకొస్తున్నాయని వీరు కనుగొన్నారు. మనుషుల్లోనూ ఇలాంటి డెంటల్ లామినా ఉన్నా కూడా మనలో కొత్త దంతాలు పుట్టుకు రావడంలేదు. దీనికి కారణం కనుగొనే పనిలో ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు.
మనిషి శరీరంలోని లామినాలోని కణాలను వేరుచేసి, ప్రయోగశాలలో కొత్త దంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని సహ అధ్యయన కర్త రాండాల్ బి. వైడ్‌లిడ్జ్ అంటున్నారు. ఈ ప్రయోగం గనుక విజయవంతం అయితే వయసుడిగి దంతాలు ఊడినా... కొత్త దంతాల పుట్టుకతో ఆహారాన్ని తినడంలో మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు కదూ...!