Andhra Pradesh: పార్టీల మధ్య తక్కువ మార్జిన్ వస్తే రీకౌంటింగ్ జరుపుతాం: ద్వివేది
- రీకౌంటింగ్ నిర్ణయాధికారం రిటర్నింగ్ అధికారులదే
- ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట ఏర్పాట్లు
- వీవీ ప్యాట్ స్లిప్పులు ఫారం 17సీ తో సరిపోలాలి
దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తయిన నేపథ్యంలో అందరి దృష్టి ఈ నెల 23న జరిగే కౌంటింగ్ పైకి మళ్లింది. ఎవరి అదృష్టం ఎలా ఉందో తేలబోయేది ఆ రోజే కాబట్టి ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కౌంటింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఫలితాల లెక్కింపులో ఎలాంటి అపశృతులు చోటుచేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. అన్ని చోట్లా ఏకకాలంలో లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని అన్నారు. 15 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
ఫలితాల లెక్కింపులో వీవీ ప్యాట్ స్లిప్పులు ఫారం 17సీతో సరిపోలాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎం కంట్రోల్ యూనిట్ లో మరమ్మతులు సాధ్యం కాకపోతే వీవీ ప్యాట్ల సంఖ్యను బట్టే ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. సజావుగా ఉన్న ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక, మరమ్మతులు వచ్చిన ఈవీఎంల వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారని ద్వివేది వివరించారు. మొరాయించిన ఈవీఎంలను కౌంటింగ్ చివర్లో లెక్కిస్తామని తెలిపారు. వీవీ ప్యాట్ స్లిప్పులు, ఈవీఎం ఓట్లతో సరిపోలాలని, రెండింటి లెక్కల్లో తేడా వస్తే రెండో సారి లెక్కిస్తారని వెల్లడించారు. లెక్కింపునకు ముందు మ్యాక్ పోలింగ్ రిపోర్ట్ సైతం లెక్కలతో సరిపోలాలని అన్నారు.
అయితే, సీఆర్సీ చేయకుండా పోలింగ్ కొనసాగించిన సందర్భాల్లో పీవో డైరీ ఆధారంగా ఆ ఓట్లు తొలగిస్తారని చెప్పారు. అంతేకాకుండా, సీఆర్సీ చేయని వీవీ ప్యాట్లకు ర్యాండమైజేషన్ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. ఓట్లు లెక్కించే సమయంలో సందేహాలు వస్తే పోలింగ్ డైరీ ఆధారంగా నిర్ణయం ఉంటుందని సీఈవో తెలిపారు. ఒకవేళ ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఆర్వో తుదినిర్ణయం తీసుకుంటారని, కొన్ని అరుదైన సందర్భాల్లో సాంకేతిక సమస్యలు వచ్చినచోట, వివాదాలు తలెత్తిన చోట ఈసీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇక, పార్టీల మధ్య తక్కువ మార్జిన్ వస్తే రీకౌంటింగ్ కు ఆదేశించే అవకాశాలు లేకపోలేదని ద్వివేది పేర్కొన్నారు. అయితే, రీకౌంటింగ్ నిర్ణయాధికారం మాత్రం ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులే తీసుకుంటారని వివరించారు. సర్వీస్ ఓట్లు, పోస్టల్ ఓట్లు, మొత్తం ఓట్ల విషయంలో రీకౌంటింగ్ జరపాల్సి వస్తే ఆర్వోలే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.