Andhra Pradesh: తమను పులివెందుల సబ్ జైలుకు మార్చాలని వివేకా హత్యకేసు నిందితుల విజ్ఞప్తి... అంగీకరించిన న్యాయస్థానం
- పులివెందుల న్యాయస్థానంలో నేడు కేసు విచారణ
- నిందితులను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
- నిందితులకు రిమాండ్ పొడిగింపు
వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించారు. ఇవాళ పులివెందుల న్యాయస్థానంలో కేసు విచారణ రాగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నిందితులకు జూన్ 3 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్టు తెలిపారు. వివేకా హత్య వ్యవహారంలో సాక్ష్యాలు తారుమారు చేసిన కేసులో ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ లను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ముగ్గురిని పోలీసులు మరోసారి పులివెందుల కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ పొడిగించారు.
కాగా, ఈ ముగ్గురు తమను కడప నుంచి పులివెందుల సబ్ జైలుకు మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వారిని పులివెందుల సబ్ జైలుకు తరలించాలంటూ ఆదేశాలు జారీచేసింది.