India: నష్టాల కారణంగా కీలక రూట్లో నాన్ స్టాప్ సర్వీసు రద్దు చేసిన ఎయిరిండియా
- డిమాండ్ లేకపోవడమే ప్రధాన కారణం
- నష్టాల్లో ఎయిరిండియా
- ఇతర సంస్థలతో పోటీపడలేకపోతున్న ఎయిరిండియా
దేశీయ విమానయాన సంస్థలతో పోటీపడడంలో చురుకుదనం ప్రదర్శించలేకపోతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా నష్టాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఏమాత్రం డిమాండ్ లేక, ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ కనిపించక ముంబయి-న్యూయార్క్ రూట్లో నాన్ స్టాప్ విమాన సర్వీసు నిలిపివేయాలని నిర్ణయించుకుంది.
ఎయిరిండియా గతేడాదే ఈ రూట్లో డైరక్ట్ విమాన సర్వీసులు ప్రారంభించింది. వాస్తవానికి ఈ రూట్ ఎంతో లాభదాయకం అయినా ఇతర విమానయాన సంస్థలతో పోటీపడడంలో ఎయిరిండియా విఫలమవుతోంది. వారానికి మూడు సర్వీసులు నడిపినా ఆశించిన మేర డిమాండ్ ఉండకపోవడంతో ముంబయి-న్యూయార్క్-ముంబయి సర్వీసులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
కొన్నినెలల కిందట పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ముంబయి నుంచి న్యూయార్క్ వెళ్లే సర్వీసులను ఎయిరిండియా తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించేది లేదంటూ పూర్తిగా సర్వీసులు ఎత్తివేస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు స్పష్టం చేశాయి.