BJP: ఎక్కడ చూసినా ఎన్డీయే హవా... ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వెనుకంజ!
- కమలనాథులపై ఓటర్ల ఆపేక్ష
- కాషాయదళానికి స్పష్టమైన ఆధిక్యం!
- దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత!
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజల నాడి ఎలా ఉందన్న విషయంలో అంచనాలు పోటెత్తుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ రూపంలో వస్తున్న ముందస్తు అంచనాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో బీజేపీకి 306 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 132, ఇతరులు 104 స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేశారు. అధికారికంగా కూడా ఫలితాలు ఇలాగే వస్తే, కాంగ్రెస్ తో ఇతరులు జతకట్టినా బీజేపీకి దరిదాపుల్లోకి రాలేకపోనుండడం గమనించాల్సిన విషయం.
న్యూస్ నేషన్ సర్వేలో సైతం ఇవే ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్ కు 118 నుంచి 126 సీట్లు, ఇతరులకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని అంచనా వేశారు. దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే బీజేపీకి ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం అందించినట్టు అర్థమవుతోంది.