Hyderabad: కూకట్ పల్లిలో విషాదం: బెండకాయ కూర బాగాలేదన్న భర్త... భార్య ఆత్మహత్య
- భార్యకు చీవాట్లు పెట్టిన భర్త
- అవమానకరంగా భావించిన భార్య
- ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (కేపీహెచ్ బీ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వండిన కూర సరిగాలేదని భర్త కోప్పడడంతో భార్య ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విచారానికి గురిచేసింది. ఎల్ఐజీ వెంచర్ లో నివసించే మనీష్, శారద దంపతులు. కొన్నాళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో శారద ఇంట్లో బెండకాయ కూర చేసింది.
అయితే వాడిపోయిన బెండకాయలతో కూర చేశావంటూ భర్త మనీష్ చిరాకు పడడమే కాకుండా, నీకు కూర సరిగా వండడం ఎప్పుడు చాతనయ్యింది గనుక అంటూ విమర్శించాడు. ఆపై తలుపును దడేల్ మని తన్నాడు. దాంతో శారద ఎంతో అవమానకరంగా ఫీలై తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి చూసేసరికి చీరతో ఉరేసుకుని కనిపించింది. అప్పటికే ఆమె ప్రాణాలు పోయాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.