: చేపనూనెతో స్లిమ్ అయిపోవచ్చు...!
మన దైనందిన జీవితంలో ఎక్కువమంది జంక్ ఫుడ్ ఇష్టపడతారు. నగరాల్లో అయితే ఇక చెప్పవలసిన పనిలేదు. దీనివల్ల అధిక బరువు పెరుగుతామని తెలిసి కూడా జంక్ ఫుడ్‌ని ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. అయితే ఇలాంటి ఆహారం వల్ల కలిగే దుష్ప్రభావాలను చేప నూనెతో దూరం చేయవచ్చట. లివర్‌ఫూల్ విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనంలో మెదడుపై జంక్‌ఫుడ్ చూపే చెడు ప్రభావాన్ని చేపనూనె తగ్గిస్తుందని తేలింది.
అధిక కొవ్వుతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో తలెత్తే దుష్ప్రభావాలను ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు అడ్డుకుంటున్నట్టు గతంలో జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. ఇప్పుడు ఒమేగా త్రీ ఆమ్లాలు జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన శరీరంలోకి వచ్చి చేరే శుద్ధ చక్కెరలు, సంతృప్త కొవ్వుల సామర్ధ్యాన్ని అడ్డుకోవడంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు ఈ విషయంపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు గుర్తించారు.
జంక్ ఫుడ్ తీసుకోవడం ద్వారా అందులోని శుద్ధ చక్కెరలు, సంతృప్త కొవ్వులు వంటివి మన శరీరం అధిక బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది మన శరీర జీవక్రియను అస్తవ్యస్తం చేయడమే కాకుండా మన మానసిక ప్రవర్తన పైన కూడా ప్రభావం చూపుతుంది. అయితే చేపనూనెలోని ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు ఇలాంటి చెడు ప్రభావాలను నిరోధిస్తాయని లివర్‌ఫూల్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ లూసీ పిక్‌వ్యాన్స్ అంటున్నారు.
మనం భోజనం చేసిన తర్వాత శరీరంలోని కణజాలాల్లో కొన్ని రకాలైన హార్మోన్లు విడుదలై మన రక్తంలో కలుస్తాయి. ఇవి శరీరంలోని నాడీ కణాలను కాపాడటంతోబాటు వాటి వృద్ధికి కూడా తోడ్పడతాయి. అయితే జంక్‌ఫుడ్ శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు మెదడుకు వెళ్లకుండా అడ్డుకునేలా రక్తంలోని వాపును ప్రోత్సహించి, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను పెంచుతోందట. కానీ ఒమేగా త్రీ ఆమ్లాలు ఇలాంటి వాపు కారకాలు, ట్రైగ్లిజరైడ్ల ఉత్పత్తి ప్రక్రియను ఆటంకపరచి శరీరంలోని హార్మోన్ల తీరును పునరుద్ధరిస్తున్నట్టు, నాడీ కణాల వృద్ధి కారకాలను తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తున్నట్టు పరిశోధకులు కనుగొన్నారు.
జంక్‌ఫుడ్ తీసుకున్న తర్వాత ఒమేగా త్రీ ఆమ్లాలు కలిసిన ఆహారం తీసుకోవడం వల్ల నాడీ క్షీణతకు సంబంధించిన వ్యాధులు, ఊబకాయం వంటి వాటినుండి మనల్ని కాపాడటమే కాకుండా తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తలపిస్తున్నాయని పిన్‌వ్యాక్స్ అంటున్నారు. కాబట్టి జంక్ ఫుడ్ తిన్నా కూడా... ఒమేగా త్రీ ఆమ్లాలు కలిగిన ఆహారం కూడా అందులో ఉండేలా చూసుకుంటే సరిపోతుందికదూ...!