YSRCP: తిరుపతి వస్తారుగా... అక్కడ చూసుకుంటా!: వెంకటరామాపురం గ్రామస్థులకు చెవిరెడ్డి వార్నింగ్
- ప్రచారానికి వచ్చిన చెవిరెడ్డి
- వద్దని తేల్చిచెప్పిన గ్రామస్థు లు
- చెవిరెడ్డి ప్రచారానికి అడుగడుగునా అడ్డుపడిన మహిళలు
చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్ కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రీపోలింగ్ జరిగే వెంకటరామాపురం గ్రామానికి వెళ్లి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఊళ్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని గ్రామస్థులు తెగేసి చెప్పడంతో చెవిరెడ్డి ఎంతో అవమానంగా ఫీలవడమే కాదు, తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తిరుపతికి వస్తారుగా, అక్కడ చూసుకుంటా మీ సంగతి అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఓ దశలో మహిళలు సైతం చెవిరెడ్డి ప్రచారానికి అడ్డుతగిలారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించడంతో చెవిరెడ్డిపై భౌతికదాడులు జరగలేదు.
గతరాత్రి, ఈ ఉదయం ఎన్ఆర్ కమ్మపల్లెలోనూ చెవిరెడ్డికి ఇదే తరహా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ప్రశాంతంగా పోలింగ్ జరిగిన తమ గ్రామాల్లో రీపోలింగ్ ఎందుకు నిర్వహిస్తున్నారంటూ సదరు గ్రామాల ప్రజలు నిలదీస్తున్నారు. చెవిరెడ్డి ఫిర్యాదు మేరకే ఈసీ రీపోలింగ్ కు ప్రకటన చేసిందన్న వార్తల నేపథ్యంలో వారు ఆయనపై కారాలుమిరియాలు నూరుతున్నారు.