: డయేరియాకు మనమూ మందు కనుగొన్నాం...!


ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డయేరియా మరణాలు మనదేశంలోనే సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలో అతిసార వ్యాధికి ప్రత్యేక వ్యాక్సిన్‌ను మనదేశంలోనే శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్‌పై అన్ని పరిశోధనలు పూర్తయిన తర్వాత త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇవ్వాల్సి వుంది.

రోటావిక్‌గా పిలవబడే ఈ కొత్త వ్యాకిన్‌ ధర మార్కెట్లో రూ.54కు లభించనుంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభించే ఇతర దేశాలనుండి దిగుమతి చేసుకునే వాక్సిన్ల ధరలో నాలుగవ వంతు ఉంటుందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీలో గతంలో సెక్రటరీగా పనిచేసిన డాక్టర్‌ ఎం.కె.భాన్‌ చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయేరియా వల్ల సుమారు 4,53,000 మంది పిల్లలు మృత్యువాతబడుతున్నారు. ఇందులో మన భారతదేశంలోనే సుమారు లక్ష మందిదాకా పిల్లలు డయేరియా బారిన పడి మరణిస్తున్నారని తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.

కొత్తగా కనుగొన్న రోటావిక్‌ వ్యాక్సిన్‌ నోటిద్వారా ఇవ్వబడేది, దీనిని 6,10, 14 వారాల వ్యవధితో మూడు డోసులుగా ఇస్తారు. పరిశుభ్రమైన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి వాటిని పాటిస్తే ఈ వ్యాక్సిన్‌ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుందని డాక్టర్‌ భాన్‌ చెబుతున్నారు. అతిసారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాము నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేకుండా చక్కగా పనిచేసిందని ఆయన చెబుతున్నారు. ఇతర పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత మరో ఏడాదికి ఇది మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

  • Loading...

More Telugu News