Andhra Pradesh: గుప్తనిధుల కోసం నల్లమల అడవుల్లోకి బ్యాంకు ఉద్యోగి.. నీళ్ల కోసం అలమటించి ప్రాణాలు కోల్పోయిన వైనం!

  • గుప్తనిధుల కోసం నల్లమలలోని పాండురంగ స్వామి దేవాలయానికి..
  • వెంట తీసుకెళ్లిన నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, చిరుతిళ్లు ఖాళీ
  • దాహంతో అలమటించి చెల్లాచెదరు..
  • ఒకరి మృతి.. మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు

గుప్తనిధుల కోసం అడవి బాట పట్టిన ఓ బ్యాంకు ఉద్యోగి దప్పికతో ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రటి ఎండలో ప్రయాణం.. వెంట తెచ్చుకున్న ఆహారం, నీళ్లు అయిపోవడంతో దప్పికతో అలమటించిపోయాడు. తొందరగా బయటపడే మార్గం లేక అడవిలోనే ప్రాణాలొదిలాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం  మున్నంగికి చెందిన హనుమంతునాయక్‌ (70)కు గుప్తనిధులపై అపార నమ్మకం. వాటి కోసం నిత్యం అడవుల్లో తిరుగుతుంటాడు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం తాడివారిపల్లి గ్రామం సమీపంలోని ఓ ఆలయంలో గుప్తనిధులు ఉన్నాయంటూ గ్రామానికి చెందిన కృష్ణానాయక్‌ (40)కు చెప్పాడు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో నక్సల్స్ ఉండేవారని, వారికి సంబంధించిన భారీ డంప్ కూడా అక్కడ ఉందని చెప్పాడు. హైదరాబాద్‌లోని కెనరా బ్యాంకు శాఖలో క్యాషియర్‌గా పనిచేస్తున్న కట్టా శివకుమార్‌కు కృష్ణానాయక్ ఈ విషయం చెప్పాడు.  

అందరూ కలిసి ఈ నెల 12న తొలుత తుర్లపాడు చేరుకుని అక్కడి నుంచి  తాడివారిపల్లికి వెళ్లారు. మూడు నీళ్ల సీసాలు, 15 మజ్జిగ ప్యాకెట్లు, కొంత చిరుతిండి వెంట తీసుకుని ఆదివారం రాత్రి అడవిలోకి దారితీశారు. నందనవనం సమీపంలో ఉన్న పాత శివాలయ కొలను ఎదుట ఉన్న పాండురంగ స్వామి దేవాలయం వైపు నడక సాగించారు. రాత్రంతా వీరి నడక సాగింది.

సోమవారం ఉదయానికి అడవిలో పది కిలోమీటర్ల లోపలికి వెళ్లిపోయారు. ఈ లోపు ఎండ వేడిమికి తట్టుకోలేకపోయారు. వెంట తెచ్చుకున్న నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఆహారం అయిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచలేదు. నీళ్ల కోసం గాలిస్తూ అడవిలో ముగ్గురూ తలోదిక్కుకీ వెళ్లి తప్పిపోయారు. ఈ క్రమంలో కృష్ణానాయక్‌కు ఓ రోడ్డు కనిపించడంతో దానిని అనుసరిస్తూ వెళ్లాడు. అలా తాడివారిపల్లికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంభం చేరుకున్నాడు.  

 ప్రమాదం నుంచి బయటపడిన కృష్ణానాయక్ ఏమీ తెలియనట్టు నటించాడు. విషయం ఎవరికీ చెప్పకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే, బుధవారం సాయంత్రం శివకుమార్‌ కుమారుడు ఫోన్‌ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అడవిలో గాలించిన పోలీసులకు గురువారం మధ్యాహ్నం శివకుమార్‌ మృతదేహం కనిపించింది. హనుమంతు నాయక్ కోసం గాలిస్తున్నారు. సురక్షితంగా ఊరికి చేరుకున్న కృష్ణానాయక్ ఆ విషయాన్ని అప్పుడే చెప్పి ఉంటే శివకుమార్ బతికి ఉండేవాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News