Chandrababu: ధర్మాన్ని కాపాడాం, ఇప్పుడా ధర్మమే మనల్ని కాపాడుతుంది: చంద్రబాబు
- అమరావతిలో ప్రవాసాంధ్రులతో సమావేశమైన సీఎం
- రాష్ట్రం కోసం ధర్మపోరాటం చేశాం
- తెలుగుజాతి సాటిలేనిదిగా ఎదగాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో ప్రవాసాంధ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలపై ప్రవాసాంధ్రులతో ముచ్చటించారు. రాష్ట్రం కోసం మనం ధర్మపోరాటం చేశామని చెప్పారు. ధర్మాన్ని మనం కాపాడాం, ఇప్పుడా ధర్మమే మనల్ని కాపాడుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాసాంధ్రులను అభినందించారు. జన్మభూమి-మా ఊరు వంటి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు గణనీయమైన పాత్ర పోషించారని కితాబిచ్చారు. భవిష్యత్ లోనూ రెట్టించిన ఉత్సాహంతో రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
ఇటీవల జేఈఈ ఫలితాల్లో తెలుగువారి ప్రభంజనం పైనా చంద్రబాబు స్పందించారు. జేఈఈ మెయిన్స్ లో తొలి నాలుగు ర్యాంకులు తెలుగువారికి దక్కడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 15 ఏళ్లలో తెలుగుజాతి ప్రపంచంలోనే సాటిలేనిదిగా ఎదగాలన్నది తన అభిమతం అని చెప్పారు. ఎక్కడ, ఏ రంగంలో అవకాశం ఉన్నా అక్కడ ఆంధ్రులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా ప్రవాసులకు సూచించారు.