Chandrababu: ఈసారి మన పనితీరు డిఫరెంట్ గా ఉంటుంది: చంద్రబాబు
- చేసిన అభివృద్ధి ఊరికేపోదు
- భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదు
- బనగానపల్లె అసెంబ్లీ స్థానంపై సమీక్షలో చంద్రబాబు వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇవాళ కూడా నియోజకవర్గాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె అసెంబ్లీ స్థానంపై సమీక్ష నిర్వహిస్తూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేసిన అభివృద్ధి ఊరికేపోదని అన్నారు.
టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందని, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని పునరుద్ఘాటించారు. అందుకే, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని మనం అయితేనే చేయగలమని భావించి ప్రజలు 2014లో టీడీపీకి పట్టం కట్టారని చంద్రబాబు పార్టీ శ్రేణులతో చెప్పారు. ఇప్పుడు కూడా అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశంతో టీడీపీకే ఓటేశారని తెలిపారు.
ఇకమీదట మన పనితీరు చాలా డిఫరెంట్ గా ఉండబోతోందని, కీలక విషయాల్లో కఠినంగా వ్యవహరించడంతోపాటు సుస్థిరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. భయం అనేది టీడీపీ రక్తంలోనే లేదని, కార్యకర్తలు ఎవరికీ బెదిరిపోయి లోబడాల్సిన పనిలేదని చంద్రబాబు ఉద్బోధించారు. వివాదాలు, ఘర్షణలకు వెళ్లవద్దని పార్టీ శ్రేణులకు గతంలోనే చెప్పానని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ ను పూర్తిగా కట్టడిచేయడంపైనే తన దృష్టి ఉందని స్పష్టం చేశారు. సీమగడ్డ నుంచి ముఠాకక్షలు సమూలంగా నిర్మూలన జరగాలన్నదే తన అభిమతమని చంద్రబాబు చెప్పారు. ఒకప్పటితో పోలిస్తే గ్రూపు రాజకీయాలు, ముఠాకక్షలకు కాలం చెల్లినట్టేనని అభిప్రాయపడ్డారు.