Chandrababu: చంద్రబాబు ఇప్పటివరకు ఎన్ని పార్టీలను ఏకం చేశారో చెప్పగలరా?: తమ్మినేని
- ఓటమిభయంతోనే చంద్రబాబు సమీక్షలు
- పార్టీని నిలబెట్టుకోవడానికే చంద్రబాబు ప్రయత్నాలు
- బ్రహ్మాండం సృష్టిస్తారని ఓ వర్గం చంద్రబాబును ఆకాశానికెత్తేస్తోంది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత తమ్మినేని సీతారాం విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు ఓటమి భయంతోనే నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ ప్యాకప్ అవడం ఖాయమని జోస్యం చెప్పారు. దేశ రాజకీయాల్లో చంద్రబాబు బ్రహ్మాండం సృష్టిస్తారని, చంద్రబాబు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని ఓ వర్గం ఆయనను ఆకాశానికెత్తేస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇవన్నీ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే తెరపైకి తీసుకువస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలు రాకముందే ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలను విమానాల్లో చుట్టేస్తూ ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నట్టు చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని, ఆయన ఇప్పటివరకు ఎన్ని పార్టీలను ఏకం చేశారో చెప్పగలరా? అంటూ తమ్మినేని ప్రశ్నించారు. తమ పార్టీకి ఓటమి ఖాయమని ముందే తెలియడంతో కార్యకర్తలు, నేతల్లో భయం పోగొట్టేందుకు చంద్రబాబు రకరకాల గిమ్మిక్కులు చేస్తున్నారంటూ విమర్శించారు.