VH: కుంతియా పార్టీకి నష్టం కలిగేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు: వీహెచ్
- ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లకు టికెట్లు ఇస్తున్నారు
- ఎప్పట్నించో ఉన్నవాళ్లను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లా?
- రాష్ట్ర ఇన్ చార్జి కుంతియా తీరుపై వీహెచ్ అసంతృప్తి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి ఆర్సీ కుంతియాపై ధ్వజమెత్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం హైదరాబాద్ గాంధీభవన్ లో జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే వీహెచ్ గాంధీభవన్ కు చేరుకుని తన నిరసన గళం వినిపించారు. అప్పటికే అక్కడ ఉన్న కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిల వద్దకు వెళ్లి పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడంలేదని, ఎప్పట్నించో ఉన్నవాళ్లను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లకు టికెట్లు ఇస్తున్నారంటూ వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై కుంతియా నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం వీహెచ్ ను అసహనానికి గురిచేసింది. దాంతో, కుంతియా తీరుపై ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీకి నష్టం వాటిల్లేలా కుంతియా కార్యక్రమాలు చేపడుతున్నారంటూ విమర్శించారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారికే ఎన్నికలలో టికెట్లు ఇస్తున్నారని, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్లకు సైతం అసెంబ్లీ టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు.