Andhra Pradesh: ప్రకాశం జిల్లా వైసీపీ నేత బూచేపల్లి సుబ్బారెడ్డి కన్నుమూత!
- వైసీపీ నేత శివప్రసాద్ రెడ్డి తండ్రే సుబ్బారెడ్డి
- హైదరాబాద్ లో చికిత్స పొందుతూ మృతి
- రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
ప్రకాశం జిల్లా వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంట్లో ఈరోజు విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివప్రసాద్ తండ్రి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి ఈరోజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు వైసీపీ నేతలు ఆయన మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపు స్వగ్రామంలో సుబ్బారెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితవర్గాలు చెప్పాయి. 2004 ఎన్నికల్లో సుబ్బారెడ్డికి కాంగ్రెస్ దర్శి అసెంబ్లీ టికెట్ ను నిరాకరించింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడు శివప్రసాద్ కాంగ్రెస్ తరఫున గెలిచి వైసీపీలో చేరారు. కానీ 2014 ఎన్నికల్లో శివప్రసాద్ ఓటమి పాలయ్యారు. కాగా, సుబ్బారెడ్డి మృతి తో దర్శిలో విషాద ఛాయలు అలముకున్నాయి.