Andhra Pradesh: ఈ నెల 17న ఆర్వో, ఏఆర్వోలకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ: ద్వివేది

  • విజయవాడలో శిక్షణ
  • ఢిల్లీ నుంచి నిపుణుల రాక
  • కౌంటింగ్ రోజున ఆర్వోల వద్ద ఫోన్లు నిషేధం అంటున్న ద్వివేది

ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గరపడుతుండడంతో రాష్ట్రంలో ఓట్ల లెక్కింపుపై సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. మే 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో ఈనెల 17న రాష్ట్రస్థాయిలో ఆర్వో, ఏఆర్వోలకు ఓట్ల లెక్కింపుపై శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ శిక్షణలో రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల ఇన్ చార్జులు పాల్గొంటారని వివరించారు.

విజయవాడలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చి ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పిస్తారని ద్వివేది చెప్పారు. ఇక, కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే ఉద్యోగుల ఎంపికలో ప్రతి జిల్లాను ఒక యూనిట్ గా భావిస్తామని, ర్యాండమ్ పద్ధతిలో ఉద్యోగుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు.

ఇందులో పలుదశలు ఉంటాయని, తొలి విడతలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగుల ఎంపిక ఉంటుందని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభానికి వారం రోజుల ముందు మొదటి విడత ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని, కౌంటింగ్ ఆరంభానికి 24 గంటల ముందు తుది విడత ర్యాండమైజేషన్ ఉంటుందని సీఈవో వివరించారు.

కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకునే తుది విడత సిబ్బంది కేటాయింపు కౌంటింగ్ రోజునే ఉంటుందని స్పష్టం చేశారు. ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8.30 గంటల తర్వాత ఆర్వోల వద్ద కూడా మొబైల్ ఫోన్లు నిషేధిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News