Telugudesam: కిడారి శ్రావణ్ కుమార్ రాజీనామ లేఖను ఆమోదించిన గవర్నర్
- గడువు పూర్తికావడంతో మంత్రి పదవికి రాజీనామా
- లేఖను సచివాలయంలో ఇచ్చిన శ్రావణ్
- గవర్నర్ కు లేఖను పంపిన సీఎంవో
నిబంధనల ప్రకారం మంత్రి పదవి చేపట్టిన 6 నెలల లోపు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావాల్సి ఉండగా, ఈలోపే గడువు ముగియనున్న నేపథ్యంలో ఏపీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆమోదించారు. కిడారి ఇవాళ అమరావతిలో పార్టీ అధినాయకత్వంతో చర్చించిన తర్వాత తన రాజీనామా లేఖను సచివాలయంలో అందజేశారు. ఆ లేఖను సీఎంవో అధికారులు గవర్నర్ కు పంపగా ఆయన లాంఛనప్రాయంగా దానిపై ఆమోదముద్ర వేశారు.
కిడారి గతేడాది నవంబర్ 11న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన తండ్రిని మావోలు బలిగొనడంతో టీడీపీ శ్రావణ్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో మంత్రి పదవి ఇచ్చింది. అయితే, నిబంధనల ప్రకారం 6 నెలల లోపు ఎన్నికల బరిలో తనను తాను నిరూపించుకోవాల్సి ఉన్నా, మే 11తో ఆ గడువు పూర్తికానుంది. దాంతో, నిబంధనలు అనుసరించి ఆయన పదవికి రాజీనామా చేశారు.