Chandrababu: ఖరగ్ పూర్ లో తెలుగువాళ్లను చూసి చంద్రబాబు భావోద్వేగం
- తృణమూల్ తరఫున చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- 42కి 42 సీట్లు గెలుచుకోవాలని పిలుపు
- దీదీని ఏమీచేయలేరంటూ మోదీకి హెచ్చరిక
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తృణమూల్ కాంగ్రెస్ తరఫున పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ నగరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగువాళ్లు గణనీయమైన సంఖ్యలో ఉన్న ఖరగ్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పరచుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగువాళ్లు పనిచేయడం ఎంతో సంతోషం కలిగిస్తోందని అన్నారు. బెంగాల్ పురోగతిలో తెలుగువాళ్లు కూడా భాగం కావడాన్ని చూసినప్పుడు ఓ తెలుగువాడిగా ఎంతో గర్విస్తున్నానని తెలిపారు. ఈ సభకు హాజరైన తెలుగు ప్రజానీకాన్ని చూసి చంద్రబాబు ఉద్వేగంతో మాట్లాడారు.
"ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది దీదీ జీ కోసం. అఖండ మెజారిటీతో దేశంలో ఎక్కడాలేనంతగా తిరుగులేని ఆధిక్యంతో ఆమెను గెలిపించాలి. 42కి 42 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే గెలవాలి. ప్రతి ఒక్కరూ టీఎంసీకే ఓటెయ్యాలి. మమతా బెనర్జీ గారు ఏడేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆమె ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఒకప్పుడు బెంగాల్ ఏంచేస్తే దేశం కూడా అదే చేసేది. ఇవాళ బెంగాల్ లో వచ్చిన పథకం రేపు కేంద్రం ప్రభుత్వం అమలు చేసేది. ఇటీవలి కాలంలో అది పోయింది. అయితే, ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితి రావాలి" అంటూ ప్రసంగించారు.
అంతేకాకుండా, ప్రధాని నరేంద్ర మోదీపైనా విమర్శలు చేశారు. ఓట్లు దండుకుని ప్రజల్ని మోసం చేశారంటూ మండిపడ్డారు. బెంగాల్ టైగర్ లాంటి మమతా బెనర్జీ ముందు వందమంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. మమతా గారిని ఇబ్బందులు పెట్టాలనుకునేవాళ్లే ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు. కాగా, తన ప్రసంగాన్ని చంద్రబాబు తెలుగులోనే సాగించడం విశేషంగా చెప్పాలి.