Congress: రాహుల్ గాంధీకి ఊరట.. ద్వంద్వ పౌరసత్వంపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

  • రాహుల్  బ్రిటన్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు
  • అందులో బ్రిటన్ పౌరుడిగా తనను పేర్కొన్నారు 
  • పిటిషన్ లో పేర్కొన్న జై భగవాన్ గోయల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందనీ, కాబట్టి ఎన్నికల్లో పోటీకి ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది. బ్రిటన్ కు చెందిన బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీలో రాహుల్ డైరెక్టర్, కార్యదర్శి హోదాలో ఉన్నారని పిటిషనర్, హిందూ మహాసభ సభ్యుడు జై భగవాన్ గోయల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

2005-06 అర్ధిక సంవత్సరానికి కంపెనీ వార్షిక ఐటీ రిటర్నులో పౌరసత్వం అనే కాలమ్ లో రాహుల్ బ్రిటిషర్ అని రాశారని వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడం కుదరదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే ఓ కంపెనీకి సంబంధించిన పేపర్ ఆధారంగా కోర్టును ఎలా ఆశ్రయిస్తారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ పిటిషనర్ ను ప్రశ్నించారు. ఓ కంపెనీ పేపర్ ను ఆధారంగా చేసుకుని కోర్టును ఆశ్రయించడం సరికాదని చెబుతూ పిటిషన్ ను కొట్టివేశారు. కాగా, దేశంలోని నిరుద్యోగం, కరవు, ఉపాధి లేమి వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాహుల్ పౌరసత్వం విషయంలో బీజేపీ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

More Telugu News