: రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన మన్మోహన్
ఐదోసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే క్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (80) నామినేషన్ దాఖలు చేశారు. మన్మోహన్ ఈరోజు అసోం అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి జీపీ దాస్ కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం జూన్ 14తో ముగియనుంది. మన్మోహన్ 1991 నుంచి అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రాజ్యసభ స్థానాలకు అసోం ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30న ఎన్నిక జరుగుతుంది. అసోం శాసనసభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. అసోంలో మొత్తం 126 ఎమ్మెల్యేలకు గాను కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు చెందినవారు 94 మంది ఉన్నారు. దీంతో, మరోసారి మన్మోహన్ ఎన్నిక లాంఛనప్రాయమేనని తెలుస్తోంది.