UK: ప్రియురాలి ఫోన్ ఓపెన్ చేయడం ఎంత తప్పో తెలిసేసరికి కటకటాల వెనక్కి చేరాడు!
- ఇంగ్లాండ్ లో ఘటన
- ప్రియురాలిపై అనుమానం
- ప్రియురాలు నిద్రిస్తుండగా చేతివేలి ముద్రతో ఫోన్ అన్ లాక్
ఇంగ్లాండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె ఫోన్ ఓపెన్ చేసి చూసి జైలుపాలయ్యాడు. ఫెయిల్స్ వర్త్ పట్టణంలో ఉండే అలెక్స్ హెవెన్స్, స్టేసీ బూత్ ఇద్దరూ ప్రేమికులు. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే, హెవెన్స్ లో ప్రియురాలిపై అనుమానం పొడసూపింది.
ఒకరోజు ప్రియురాలు నిద్రలో ఉండగా ఆమె ఐఫోన్ ను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. ఫింగర్ ప్రింట్ పాస్ వర్డ్ ప్రొటెక్షన్ ఉండడంతో నిద్రలో ఉన్న స్టేసీ వేలితోనే ఫోన్ ను అన్ లాక్ చేశాడు. ఆపై అందులో ఉన్న ఫొటోలు, చాటింగ్ లన్నీ చూశాడు. ఆమె లేచిన తర్వాత ఫోన్ లో ఉన్న ఫొటోల్లో కనిపిస్తున్న వ్యక్తుల గురించి ఆరాతీయడం మొదలుపెట్టాడు.
దాంతో వళ్లు మండిపోయిన స్టేసీ ప్రియుడ్ని ఇష్టంవచ్చినట్టు దూషించింది. హెవెన్స్ లో ఉన్మాదం పెచ్చరిల్లడంతో ఆమె భుజంపై కొరకడమే కాకుండా, చేతివేళ్లను వెనక్కి విరిచేశాడు. తనపై ప్రియుడు దాడిచేయడంతో స్టేసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన మాంచెస్టర్ క్రౌన్ న్యాయస్థానం హెవెన్స్ కు ఏడాది జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.