Andhra Pradesh: మేం మట్టి దొంగలం కాదు.. యాదవ, క్రైస్తవ సోదరుల భూముల్ని దొంగిలించలేదు!: వల్లభనేని వంశీకి వైసీపీ కౌంటర్

- ప్రజలు తిరస్కరిస్తారని వంశీకి భయం పట్టుకుంది
- ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు
- విజయవాడలో మీడియాతో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు
ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. టీడీపీ పాలనలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాను డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదనీ, ప్రజా సమస్యలు పరిష్కరించడానికే వచ్చానని స్పష్టం చేశారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు సమస్యలు సృష్టించే రీతిలో ఐదేళ్ల టీడీపీ పాలన సాగిందని వెంకట్రావు విమర్శించారు. ‘మేం మట్టి దొంగలం కాదు. అజ్జనపూడిలో యాదవ, క్రైస్తవ సోదరుల భూములను దొంగిలించింది మేం కాదు. అది ఎవరో ప్రజలందరికి తెలుసు. స్థానిక ఎమ్మెల్యే దురాగతాల గురించి ప్రజలందరూ చెబుతున్నారు. ప్రజలు చెప్పిందే నేను మాట్లాడా. అంతే తప్ప వంశీపై వ్యక్తిగత దూషణలు చేయలేదు.
ఎమ్మార్వోలను మండల రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేయించకుండా మట్టి రెవెన్యూ ఆఫీసర్లుగా మార్చేశారు. చెరువుల్లోని మట్టిని యథేచ్ఛగా తవ్వుకున్నారు. దీనిపైనే నేను ప్రశ్నించా. రేపు జగన్ అధికారంలోకి రాబోతున్నాడనీ, గన్నవరంలో టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపిస్తాడన్న భయంతోనే టీడీపీ నేతలు ఈ తరహాలో మాట్లాడుతున్నారు’ అని యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.