Telangana: ఒకమ్మాయి 85 శాతం మార్కులొచ్చినా ఆత్మహత్య చేసుకుంది, మరో అమ్మాయి అన్నీ పాసైనా ఆత్మహత్య చేసుకుంది: ఇంటర్ కార్యదర్శి అశోక్
- ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు కారణం కాదు
- ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల ఫలితాల్లో పొరబాట్లు జరగలేదు
- వారి పేపర్లన్నీ పరిశీలించాం
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మార్కుల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో 20 మందికి పైగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో ఎలాంటి పొరబాట్లు జరగలేదని స్పష్టం చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల పేపర్లను రీవెరిఫికేషన్ చేశామని ఆయన వెల్లడించారు.
ఒక విద్యార్థినికి 85 శాతం మార్కులు వచ్చినా ఆత్మహత్య చేసుకుందని, మరో విద్యార్థిని అన్ని సబ్జెక్టులు పాసైనా బలవన్మరణం చెందిందని వివరించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనేది వాస్తవం కాదని అశోక్ అభిప్రాయపడ్డారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ నెల 10వ తేదీన ఆ ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత జవాబు పత్రాలను అందుబాటులో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా అన్ని చర్యలు తీసుకున్నాకే ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.