Andhra Pradesh: రీపోలింగ్ ముగిసేవరకు ఏపీలో నిరుద్యోగ భృతి పెంపు కుదరదని తేల్చిచెప్పిన ఈసీ
- ఏపీ ప్రభుత్వానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల సంఘం
- ఆదరణ పథకానికి ఆమోదం
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లకు అనుమతి
ఏపీ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిరుద్యోగ భృతి పెంచడం కుదరదని రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం అనుమతి కోరగా, ఈసీ తిరస్కరించింది. రాష్ట్రంలో రీపోలింగ్ ముగిసిన తర్వాత పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిరుద్యోగ భృతి పెంపు రీపోలింగ్ జరిగే చోట ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని ఈసీ భావించినట్టు తెలుస్తోంది.
అయితే, కులవృత్తుల వారికి పనిముట్లు అందించే ఆదరణ పథకంపై మాత్రం కొన్ని షరతులతో ఆమోద ముద్ర వేసింది. కొత్తగా లబ్దిదారుల పేర్లు నమోదు చేయకుండా ఆదరణ పథకం కొనసాగించవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. అంతేగాకుండా, మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కూడా అభ్యంతరాలేవీ లేవని ఈసీ పేర్కొంది.