YSRCP: భూములు అయిపోయాయి, ఇక నదుల మీద పడ్డారు: వైసీపీ నేత ఉండవల్లి శ్రీదేవి
- టీడీపీ నేతలు దండుపాళ్యం ముఠాలా తయారయ్యారు
- రాబందుల్లా పీక్కుతింటున్నారు
- ఈసీ, సీఎస్ జోక్యం చేసుకోవాలి
వైసీపీ మహిళా నేత ఉండవల్లి శ్రీదేవి టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, ఇన్నాళ్లు భూములను దోచుకుని, ఇప్పుడు నదులపైనా పడ్డారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతుంటూ, మరో దండుపాళ్యం ముఠాలా తయారయ్యారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని సింగపూర్ లా మార్చేస్తామంటూ రైతుల నుంచి భూములను తీసుకుని వారిని నిలువునా వంచించారని శ్రీదేవి ఆరోపించారు.
భూములు అయిపోవడంతో కృష్ణానదిపై పడి ఎక్కడికక్కడ పూడ్చివేతలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, దేవినేని ఉమా నివాసాలకు మధ్యలో రిసార్ట్ నిర్మించేందుకు కృష్ణానదిని పూడ్చుతున్నారని, నదీ ప్రవాహ దిశను మార్చడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. 70 ఎకరాల్లో కృష్ణా నదిపై మట్టిదిబ్బ నిర్మించడం ద్వారా కొత్తరకం ఆక్రమణలకు తెరలేపారని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘంతో పాటు సీఎస్ కూడా జోక్యం చేసుకోవాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.