Telangana: హాజీపూర్ ఘటనల్లో శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదు మరికొందరున్నారు: టి-మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద
- నిందితులను కఠినంగా శిక్షించాలి
- డీజీపీని కలిసిన టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు
- సీఎం మహిళా సంఘాలతో చర్చించాలి
కొన్నిరోజుల క్రితం తెలంగాణలో బయటపడ్డ వరుస హత్యలు తీవ్ర కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని హాజీపూర్ అనే గ్రామంలో ఓ బావిలో అమ్మాయిల మృతదేహాలు బయటపడడం దిగ్భ్రాంతికి గురిచేశాయి. అయితే, ఈ ఘటనల్లో సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి ఒక్కడే కాదని, మరికొందరి ప్రమేయం కూడా ఉందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలు (టీపీసీసీ) నేరెళ్ల శారద ఆరోపిస్తున్నారు.
హాజీపూర్ వరుస హత్యల అంశంపై ఆమె రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. శ్రీనివాసరెడ్డికి సహకరించిన వాళ్లను కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంఘాలు, పోలీసులతో చర్చించాలని కోరారు.
అంతకుముందు ఆమె హాజీపూర్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అర్థం చేసుకున్నారు. కాగా, హాజీపూర్ మృతుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉండడం సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి అఘాయిత్యాలకు పరాకాష్ట అని చెప్పాలి. శ్రావణి అనే అమ్మాయి ఆచూకీ లేకుండా పోయిందన్న కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ మొదలుపెట్టగా నిర్ఘాంతపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అదే బావిలో శ్రావణి మృతదేహంతో పాటు మనీషా అనే మరో అమ్మాయి మృతదేహం కూడా దొరికింది. ఆపై, కల్పన అనే ఆరో తరగతి అమ్మాయి అవశేషాలు సైతం అక్కడే బయటపడ్డాయి. ఉన్మాది శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.