YSRCP: ఇప్పుడున్న మంత్రుల్లో ఒక్కరు గెలిచినా నేను రాజకీయాలు మాట్లాడను: పృథ్వీరాజ్
- రానున్నది రాజన్న రాజ్యం
- జగనే సీఎం అవుతారు
- మే 23 ఉదయం 11.30కి అమరావతిలో వైసీపీ జెండా ఎగురుతుంది
టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ తాజా రాజకీయాలపై మరోసారి ఘాటైన రీతిలో స్పందించారు. సీఎం చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు. "మీరు గెలిస్తే ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు! ఓడిపోతామని సంకేతాలు రాగానే ఈవీఎంలు సరిగా పనిచేయడంలేదు, మొరాయిస్తున్నాయంటారు. ఇవన్నీ చూశాం మనం. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు సమీక్షలు చేయడం కుదరదు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి సమీక్ష పెట్టినా అధికారులు రాకపోవడం మీడియాలో చూశాం.
ఎవరైనా జీవితకాలం సీఎంగా ఉండరు. రాజశేఖర్ రెడ్డి గారు 2004, 2009లో సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో జగన్ సీఎం అవుతున్నారు. ఇదో చక్రంలాంటిది. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకపోతే ఎన్నికల రూపేణా ప్రభుత్వాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. ఇది రాజ్యాంగంలో పొందుపరిచారు. అంతమాత్రాన ప్రజల తీర్పును చిలవలుపలవలు చేయాల్సిన పనిలేదు.
మన రాష్ట్రంలో ఇప్పుడున్న మంత్రుల్లో ఒక్కరైనా గెలిస్తే నేను మళ్లీ రాజకీయాలు మాట్లాడను. ఒక్క మంత్రి కూడా గెలవడు, రానున్నది రాజన్న రాజ్యమే. జగనే సీఎం అవుతారు. మే23 ఉదయం 11.30 గంటలకు అమరావతి కోటపై వైసీపీ జెండా ఉంటుంది, ఇది సత్యం!" అని పేర్కొన్నారు.