YSRCP: ఈసీలోనే కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు: ద్వివేదీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేత నాగిరెడ్డి
- సబ్బం హరిపై చర్యలు తీసుకోవాలి
- పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభపెడుతున్నారు
- మా వద్ద ఆధారాలున్నాయి
వైసీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిశారు. ఈసీలోనే కొందరు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. ద్వివేదీని కలిసిన అనంతరం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇంటెలిజెన్స్ వర్గాల అండతో ఒక అబ్జెక్ట్ ఏజెన్సీ ఈసీలోకి చొరబడిందంటూ పరోక్షంగా టీడీపీపై ఆరోపణలు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై చర్యలు తీసుకోవాలని కూడా సీఈవోను కోరినట్టు తెలిపారు. దీనిపై తమ వద్ద అన్నిరకాల ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. సబ్బం హరి పలువురిని ప్రలోభ పెడుతున్నట్టు కొన్ని ఆడియో టేపులను కూడా ఎన్నికల సంఘానికి అందజేసినట్టు నాగిరెడ్డి వెల్లడించారు.