: ఈ ఏడాది మంచి వానలు కురుస్తాయి: వాతావరణ శాఖ
నైరుతి రుతుపవనాలు తొందర్లోనే భారత్ లో ప్రవేశించనున్నాయని భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను కారణంగా అండమాన్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఈ తుపానే నైరుతి రుతుపవనాలు తొందరగా రావడానికి సహకరించిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ పరిసర ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని అధికారులు తెలిపారు. అండమాన్ లో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో కేరళ తీరాన్ని తాకి, జూన్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ ను పలకరిస్తాయి. ప్రస్తుతం పరిస్థితి సానుకూలంగా ఉండడంతో సకాలంలో ఇవి ప్రవేశించే అవకాశముందని, ఈ ఏడాది మంచి వానలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.