BJP: సాధ్వీ ప్రజ్ఞా సింగ్ పై కొరడా ఝుళిపించిన ఈసీ!
- మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం నుంచి నిషేధం
- కర్కరే, బాబ్రీ మసీదుపై వ్యాఖ్యల ఫలితం
- సీరియస్ గా తీసుకున్న ఈసీ
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బీజేపీ మహిళా నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ కు ఎన్నికల సంఘం నుంచి ఊహించని నిర్ణయం ఎదురైంది. ప్రజ్ఞా సింగ్ ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే, బాబ్రీ మసీదు అంశాలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రజ్ఞా సింగ్ మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఈ బీజేపీ నేత 72 గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కుదరదు.
మాలేగావ్ పేలుళ్ల కేసు విచారణ సందర్భంగా కర్కరే తనను కొట్టారని, అందుకే తాను శాపం పెట్టానని, ఆ శాపం తగిలే ఆయన పోయారని ప్రజ్ఞా వ్యాఖ్యానించారు. మరో సందర్భంలో, బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో తాను కూడా ఉన్నానని, అందుకు గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో ఈసీ వాటిపై దృష్టి పెట్టింది.