Telugudesam: సీఎస్ సొంతంగా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదు: లంక దినకర్

  • రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది
  • గవర్నర్ ఆదేశాలకు లోబడాల్సిన పనిలేదు
  • రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రికే సీఎస్ రిపోర్ట్ చేయాలి

తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత లంక దినకర్ కొన్నిరోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్రంలో సీఎస్ తీరుతెన్నులపై వ్యాఖ్యలు చేశారు. సీఎస్ సొంతంగా ఉత్తర్వులు ఇవ్వడం కుదరదని, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాధిపతిగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకే సీఎస్ రిపోర్ట్ చేయాలి తప్ప గవర్నర్ కో, కేంద్రానికో రిపోర్ట్ చేస్తామంటే కుదరదని అన్నారు. ఈ విషయం చెప్పే క్రమంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అధికారాలను గుర్తుచేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఇచ్చిన తీర్పును ఉదహరించారు.

"సాధారణ రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్ లకు ఎక్కువ అధికారాలు ఉంటాయి. అలాంటి కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ లు సైతం పరిపాలనలో అతిగా జోక్యం చేసుకోవడం కుదరదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ స్పష్టం చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే సాధారణ రాష్ట్రాల్లో గవర్నర్ లకు తక్కువ అధికారాలు ఉంటాయి. మరలాంటప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండాలి?

దానికితోడు కేంద్రం అతిపెత్తనం కూడా ఇక్కడ పరిశీలించాలి. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ లు, సీఎస్ లతో కేంద్రం తమ కర్రపెత్తనం చేసే ప్రయత్నాలకు పాల్పడుతోంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న కిరణ్ బేడీ అక్కడి సీఎస్, ఇతర అధికారుల సాయంతో ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడాన్ని మధురై బెంచ్ తప్పుబట్టింది. ఇక్కడ, ఏపీలో కూడా అదే వర్తిస్తుంది. గవర్నర్ కానీ, సీఎస్ కానీ ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయాలే తప్ప కేంద్రానికి కాదు అనే విషయాన్ని కిరణ్ బేడీ విషయంలో కోర్టు ప్రస్తావించింది.

సీఎస్ విషయంలో కూడా మధురై బెంచ్ స్పష్టంగా చెప్పింది. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రే అధిపతి, ఆ రాష్ట్ర మంత్రులు కానీ, సీఎస్ కానీ రాష్ట్రాధిపతి అయిన ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేయాలి అని తేల్చి చెప్పింది. అంతేతప్ప, మీ ఇష్టం వచ్చినట్టు సమీక్షలు చేస్తూ గవర్నర్ కు రిపోర్ట్ చేయడం కానీ, కేంద్రానికి పంపడం కానీ చేయకూడదని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ వివరించింది. పుదుచ్చేరిలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి విలువ లేకుండా చేశారు. ఇది ఏపీకి కూడా అన్వయించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన ఆదేశాలను సీఎస్ ఇవ్వజాలడు అనే విషయం అర్థమైంది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాయలసీమలో వడగండ్ల వాన తదితర నష్టాలపై రివ్యూ మీటింగ్ పెడితే అధికారులు హాజరుకాని పరిస్థితి ఏర్పడింది, దీనిపై సీఎస్ సమాధానం చెప్పాలి. అధికారులు ఓ మంత్రికి సహకరించాల్సిన అవసరంలేదా? ఇలాంటి అధికారులందరూ మధురై బెంచ్ ఇచ్చిన తీర్పును ఓ మేలుకొలుపుగా భావించాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ కు లోబడాల్సిన అవసరం లేదు, సీఎస్ లు సొంతంగా ఉత్తర్వులు జారీ చేయడం కుదరదు, ప్రభుత్వ ఆదేశాల మేరకే పనిచేయాలి" అంటూ లంక దినకర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News