Chandrababu: చంద్రబాబు మేడే కానుక... చంద్రన్న బీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు!
- త్వరలోనే అమల్లోకి వస్తుంది
- కార్మికుల కోసం సీఎం నిర్ణయం
- మేడే రోజు చంద్రబాబు ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మేడే సందర్భంగా కార్మికులకు కానుక ప్రకటించారు. చంద్రన్న బీమా ద్వారా కార్మికులకు అందిస్తున్న రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని త్వరలోనే రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు ట్వీట్ చేశారు. కార్మికులకు టీడీపీ అన్నివేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే డ్రైవర్ల సంక్షేమం కోసం సాధికార సంస్థ ఏర్పాటుచేసి ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కార్మికులను దోపిడీ చేసేవాళ్లను వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
త్వరలోనే అసంఘటిత రంగ కార్మికులకు ఉచితంగా సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. కాగా, మేడే సందర్భంగా చంద్రబాబు విజయవాడలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.