JC: రెడ్డి వర్గం మొత్తం జగన్ వెంటే ఉంది... గెలిచి పనిచేస్తే సంతోషిస్తా: జేసీ దివాకర్ రెడ్డి
- రెడ్లలో చాలా మంది ఎన్నికల్లో మద్దతుగా నిలిచారు
- చంద్రబాబు చిత్తశుద్ధిని చూసే మద్దతిచ్చా
- తనకు కూడా కులాభిమానం ఉందన్న జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్డి వర్గమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెనుకే ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన వర్గంలో ఉన్న రెడ్లల్లోనూ చాలా మంది ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా నిలిచారని కీలక వ్యాఖ్యలు చేశారు.
99.999 పర్సంట్ జగన్ వెంట నిలిచారని, నూటికో, కోటికో ఒకడు తనలాంటోడు జగన్ వెంట లేడని అన్నారు. జగన్ గెలిచి, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటు పడితే తాను సంతోషిస్తానని అన్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తుండబట్టే తాను మద్దతిస్తున్నానని, జగన్ అలా పనిచేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. తనకు చాలా కులాభిమానం ఉందని, లేదనుకుంటే చాలా పొరపాటేనని అన్నారు. రెడ్లంతా జగన్ కు ఓట్లు వేయబోరని తాను అనుకుని తప్పు చేశానని అనుకున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు కులాభినానం ప్రాతిపదికనే జరిగాయని జేసీ అంచనా వేశారు.