BJP: రేపు నాలుగో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం... బీజేపీకి ఎంతో కీలకం!
- 9 రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్
- బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
- పోలింగ్ లో పాల్గొననున్న 12.79 కోట్ల ఓటర్లు
దేశంలో నాలుగో విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 9 రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు ఈ పోలింగ్ క్రతువులో పాల్గొననున్నారు. కాగా, నాలుగో దశ నుంచి చివరిదైన ఏడో దశ పోలింగ్ వరకు ఇకమీదట జరిగే ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి.
ఏప్రిల్ 29 నుంచి మే 19 వరకు జరిగే వివిధ దశల పోలింగ్ లో మొత్తం 239 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 282 స్థానాలు గెలుచుకోగా, వాటిలో 183 స్థానాలు ఈ నాలుగు దశల్లో ఎన్నికలు జరుపుకుంటున్న రాష్ట్రాల నుంచే దక్కాయి. మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి మిగిలిన ఈ నాలుగు దశలే ప్రాణాధారం కానున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది.