: తెలంగాణ వస్తే కడియం సీఎం అవుతారా?
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత కడియం శ్రీహరి మున్ముందు అద్భుతమైన స్థానంలో ఉంటారని కేసీఆర్ పేర్కొనడం పలు ఊహాగానాలకు ఆస్కారమిస్తోంది. తెలంగాణ వస్తే ఓ దళితుడే తొలి ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ ఎప్పట్నుంచో చెబుతున్నారు. నేడు కడియం టీఆర్ఎస్ లో చేరిక సందర్భంగానూ ఆ విషయాన్నే మరోసారి నొక్కి చెప్పారు.
దళితుడే తెలంగాణ సీఎం అవుతాడని పేర్కొంటూ.. కడియం మచ్చలేని నాయకుడని, 9 ఏళ్ళుగా మంత్రి పదవుల్లో రాణించిన వ్యక్తి అని కొనియాడారు. చిల్లరమల్లర రాజకీయాలకు పాల్పడే వ్యక్తి కాదని చెబుతూ, స్వార్థరహితుడని కితాబిచ్చారు. అందరూ తృప్తి పడేలా కడియం భవిష్యత్తులో అద్భుతమైన స్థానంలో ఉంటారని ఈ సందర్బంగా కేసీఆర్ తెలిపారు.
కాగా, వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన కడియం శ్రీహరి దళితుడన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో 30 ఏళ్ళకు పైగా కొనసాగిన ఈయనకు వివాదరహితుడున్న పేరుంది. వ్యక్తిగత విమర్శలకూ తెగిస్తున్న నేటి రాజకీయాల్లో కడియాన్ని సౌమ్యుడని సహచరులు పేర్కొంటారు. ఇక టీఆర్ఎస్ పార్టీలో పలువురు దళిత నాయకులున్నా వారెవరూ రాష్ట్రస్థాయి నేతలు కాకపోవడం గమనార్హం!